ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్త్రీమూర్తి "రాధ"


మహోన్నతమైన రాధా ప్రేమ తత్వం....
* ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్త్రీమూర్తి "రాధ" ....
* స్వచ్చమైన ప్రేమకు నిదర్శనం పల్లెపడుచు రాధా....
* రాధా తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసిందా..!!
* పల్లెపడుచు రాధా స్వచ్చమైన ప్రేమకు కృష్ణుడు దూరమయ్యాడా...??
.
గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే......
ప్రేమ అన్న పదాన్ని నిర్వచించమని ఎవరైనా అడిగితే జవాబుగా "రాధ" అన్న ఒకేఒక్క పదాన్ని మాత్రమే చెబుతారు. ప్రేమకు దీనిని మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ. అప్పటికీ ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకేఒక్క స్త్రీమూర్తి రాధ. ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు. తెలుసని అనుకుంటారు భ్రమిస్తారు.అంతే.
లోకంలో ఉన్నవి కామమూ స్వార్ధమూ మాత్రమే. ప్రేమనేది ఈలోకంలో లేనేలేదు.లోకులకెవ్వరికీ ప్రేమ అనేది తెలియనే తెలియదు.తెలుసనుకుంటే అది పిచ్చిభ్రమ మాత్రమె.
కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు. కొందరు కోరికను ప్రేమనుకుంటారు. మరి కొంతమంది అభిమానాన్ని ప్రేమనుకుంటారు. ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు. అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందరో ఉంటారు. ఎక్కువమంది కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. నిజానికి వీటన్నిటి వెనుకా ఉండేది మాత్రం స్వార్ధమే.
లోకంలో ఉన్న ఈ ప్రేమలన్నీ స్వార్ధంతో నిండినవే. బృహదారణ్యక ఉపనిషత్ లో యాజ్ఞవల్క్య మహర్షి ఇదేమాటను తన భార్య అయిన మైత్రేయితో చెబుతాడు.మైత్రేయి సామాన్యవనిత కాదు. ఆమె మహాపండితురాలు, బ్రహ్మవాదిని. ఆమెతో యాజ్ఞవల్క్యుడు ఈ సత్యాన్ని చెబుతాడు.
"లోకంలో భర్తను ప్రేమించేది భర్తకోసం కాదు. ఆత్మ కోసమే. భార్యను ప్రేమించేది భార్యకోసం కాదు. ఆత్మకోసమె. సంతానాన్ని ప్రేమించేది సంతానంకోసం కాదు. ఆత్మ కోసమే." ఈ విధంగా ఇంకా చాలా సంభాషణ సాగుతుంది. ఈ సంభాషణ ద్వారా ఆయన ఆత్మతత్వాన్ని భార్యకు ఉపదేశిస్తాడు. ఈ సంభాషణకు లోతైన వేదాంతార్ధాలున్నాయి.
వాటిని అలా ఉంచితే, సామాన్యార్ధంలో చూచినా కూడా 'ఎవరు దేనిని ప్రేమించినా తన సుఖం కోసమే ఆ పని చేస్తారు కాని ఎదుటివారి సుఖం కోసం కాదు. ఆ వ్యక్తైనా వస్తువైనా తనకు ఇచ్చే సుఖాన్ని బట్టి ఆ వ్యక్తి అన్నా వస్తువన్నా తాత్కాలికంగా ఇష్టం కలుగుతుంది.కనుక ప్రతి మనిషీ నిజానికి తన సుఖాన్నే తాను ప్రేమిస్తున్నాడు గాని ఇతరులను కాదు-అని తేలుతుంది. మనకు నచ్చని అనేక చేదునిజాలలో ఇదొక చేదునిజం. అందుకే అవసరం ఉన్నంతవరకే మనుషుల మధ్యన సోకాల్డ్ 'ప్రేమ' అనేది ఉంటుంది. అవసరం తీరిన తరువాత ఉన్నట్టుండి మాయం అవుతుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. అసలు ఇది ప్రేమే కాదు. ఇది అవసరార్ధ ఏర్పాటు మాత్రమే.దీనిని మానవులు ప్రేమగా భ్రమిస్తారు. ఇది స్వార్ధమే కాని ప్రేమ కానేకాదు.
లోకంలో నడుస్తున్న సంసారాలు,కాపురాలు అన్నీ 'అవసరం' అన్నదానిమీదే నడుస్తున్నాయి గాని 'ప్రేమ' అనేదాని మీద ఆధారపడి కాదు. కాని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం మారదు.
రాధ ప్రేమ ఇలాంటిది కాదు. స్వార్ధాన్ని దాటిన ప్రేమ ఆమె సొంతం. నిజానికి స్వార్ధాన్ని దాటినదే నిజమైన ప్రేమ అవుతుంది. తన ఆనందాన్ని ఆశించే ప్రేమ ఆమెది కాదు. ప్రియతముని ఆనందాన్ని మాత్రమే ఆశించిన ప్రేమ ఆమె సొంతం. తన ఆత్మనే అర్పించగలిగిన ప్రేమ ఆమె సొంతం. రాధయొక్క ప్రేమస్థాయిని మానవమాత్రులు ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు. సంపూర్ణ స్వార్ధరహిత స్థితిని అందుకున్నవారే ఆ ప్రేమను కొద్దిగా అర్ధం చేసుకోగలరు. తనను తాను సంపూర్ణంగా అర్పించి తానే పూర్తిగా అదృశ్యం కాగలిగిన వారికే ఆ ప్రేమ అందుతుంది. దేవతలకి కూడా అందని ఈ స్థితి ఆమె సొంతం అంటే ఇక మామూలు మానవుల మాట చెప్పేదేముంది?ఎందుకంటే దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు.రాధ ఆ భయాన్ని కూడా అధిగమించింది.
అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది. అందుకే ఆ ప్రేమ ఆమెను రసరాణిని చేసింది. సర్వదేవతాశిరోమణిని చేసింది. సకలలోకసామ్రాజ్ఞిని చేసింది. మహత్తర ప్రేమస్వరూపిణిగా భక్తబృంద పెన్నిధిగా ఆమె ప్రతినిత్యం విరాజిల్లుతూ ఉన్నది. ఆమె తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసింది. కృష్ణుడు నిరంతరమూ రాధానామాన్ని జపిస్తూ ఉంటాడని,రాధనే నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతాయి. అంతగా అతడు రాధాదాసుడయ్యాడు. యోగేశ్వరుడైన కృష్ణుడు రాధాదాసుడా? కృష్ణుడు నిరంతరమూ రాధికను ధ్యానిస్తాడా?ఇదెలా సంభవం?ప్రేమతో సమస్తమూ సాధ్యమే. సమస్తమూ సంభవమే.ప్రేమకు కట్టుబడినట్లు భగవానుడు ఇక దేనికీ కట్టుబడడు.
రాధిక,వయసులో కృష్ణుని కంటే పెద్దది అని పురాణాలు చెబుతున్నాయి. ఆమె కృష్ణునికి వరసకు మేనత్త అవుతుంది అనికూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. కాని ఈ తేడాలన్నీ వారి ప్రేమకు ఏమాత్రం అడ్డురాలేదు. శ్రీకృష్ణుని మనోహరరూపాన్ని చూచి అందరూ ముగ్దులవుతారు. ఆ దివ్యమంగళ ప్రేమమూర్తిని చూచి మైమరచని ప్రాణి ఎక్కడుంటుంది?కృష్ణుని సమ్మోహనకరమైన చిరునవ్వులోని మహత్యానికి దాసోహం అనని జీవి ఉండటానికి వీల్లేదు. అలాగే బృందావన గోపికలూ అయ్యారు.ఆయన మురళీగానాన్ని విని వారందరూ మైమరిచారు.
బృందావనంలో,యమునాతీరంలో,వెన్నెలరాత్రులలో,మదనమోహనుని మృదుమధుర మురళీరవాన్ని విని పులకరించి తమతమ కుటుంబాలనూ,పిల్లలనూ కుటుంబసభ్యులనూ,చేస్తున్న పనులనూ ఎక్కడివారిని అక్కడ వదలి మంత్రముగ్దలలాగా ఆ మురళీనాదం వినవస్తున్న వైపు గోపికలందరూ పరుగులెత్తారు.ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేవో వారికి ధ్యాస లేదు. కాళ్ళకు ముళ్ళు గుచ్సుకుంటున్న సంగతి కూడా వారికి తెలీదు. దారిలో పాములను తొక్కుకుంటూ వెళుతున్నారో లేదో స్పృహే లేదు. తమతమ కుటుంబాలు ఉన్నాయో,ఏమయ్యాయో వారికి చింతే లేదు. వారందరూ జీవులు ఆయన జీవేశ్వరుడు. ఇనుపముక్కలు అయస్కాతం వైపు ఆకర్షింపబడినట్లు వారి హృదయాలు కృష్ణుని వైపు లాగబడ్డాయి.
అక్కడ లతానికుంజం మధ్యలో పూర్ణచంద్రుని లాగా చిరునవ్వుమోముతో ప్రకాశిస్తున్న కృష్ణుని చూచి వారు తమను తాము పూర్తిగా మరిచారు. దేహభ్రాంతికి అతీతులయ్యారు.కృష్ణుని దివ్యప్రేమలో వారి వ్యక్తిత్వాలు కరిగి మాయమయ్యాయి.వారికి మాయామోహాలు పటాపంచలయ్యాయి. దేహభ్రాంతి వారిని ఒక్కసారిగా ఒదిలిపెట్ట్టింది.కృష్ణుని దివ్యమంగళరూపమే వారికి కనిపించసాగింది.ప్రపంచాన్నే వారు మరచిపోయారు. మహాయోగులకు కూడా అందనట్టి ప్రేమపూర్వక భావోన్మత్తస్థితి వారికి కరతలామలకమైంది. కృష్ణుని అలా చూస్తూ ఆ మహాప్రేమలో మైమరచారు.ఆ ఆనందస్థితిలో ప్రపంచాన్నే మరిచిపోయారు.దివ్యమైన సమాధిస్థితిలో కరిగిపోయారు. ప్రేమయోగంలో తరించారు.
కాని వారుకూడా తమతమ ఆనందం కోసమే కృష్ణుని ప్రేమించారు.కృష్ణుని సాన్నిధ్యం ఇచ్చేటటువంటి దివ్యమైన ఆనందస్థితిని వారు ఆశించారు.ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ సమాధిస్థితిలో ఉండాలని వారు కోరుకున్నారు.అదే మిగిలిన గోపికలకూ రాధకూ ప్రధానమైన భేదం. రాధ ఈ స్థాయిని కూడా అధిగమించింది. రాధ తన ఆనందాన్ని ఆశించలేదు. ఆమె కృష్ణుని ఆనందాన్ని ఆశించింది. కృష్ణుడు ఆనందంగా ఉండటం కోసం తాను ఏమి చెయ్యగలదు?అనే ఆమె ఎప్పుడూ తపించేది.తన ప్రియతముని ఆనందం కోసం తన జీవితాన్ని తన సర్వస్వాన్ని ఆమె తృణప్రాయంగా వదిలిపెట్టింది.తన ఆత్మనే అర్పించి తానొక అనాధగా మిగిలింది. లోకం అర్ధం చేసుకోలేని అతీతస్తితి గోపికలది అయితే, గోపికలను మించిన స్థితి రాధది. దైవానందం కోసం లోకాన్ని లెక్కచెయ్యని స్తితి గోపికలది అయితే,ఆ ఆనందాన్ని కూడా తృణీకరించి పూర్తిగా దైవానికి అర్పణ అయిన స్థితి రాధది.
తన స్థితిని చూచి లోకులు ఏమనుకుంటారో అన్న భయం ఆమెనుంచి దూరమైంది. ఈ బంధాన్ని సమాజం హర్షించదేమో అన్న శంక ఆమె మదిలో లేశమాత్రం కూడా తలెత్తలేదు.తన ప్రియతముని ముందు సమస్త ప్రపంచమూ ఆమెకు తృణప్రాయంగా కనిపించింది. రాధ మనస్సులో కృష్ణుడు తప్ప ఇతర చింత లేనేలేదు. పగలూ రాత్రీ తన ప్రియతముని ధ్యానంలో ఆమె మునిగి ఉండేది. తన వ్యక్తిత్వం ఆ క్రమంలో ఎలా అదృశ్యం అయిందో ఆమెకే తెలీదు.లోకులకు అత్యంత ప్రియమైన దేహంకూడా ఆమె స్మృతిలోనుంచి తప్పుకుంది.ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యాసతో ఆమె పరవశించేది."తాను రాధను"- అన్న స్పృహకూడా ఆమెను వదలి వెళ్ళిపోయింది.
ఈ ప్రేమధ్యానంలో పడి సమస్త లోకబంధాలకూ ఆమె అతిసులువుగా అతి సహజంగా అతీతురాలైంది. ప్రేమమహిమ వల్ల విషయవాంఛలు ఆమెలో అదృశ్యమయ్యాయి.తన శరీరాన్నే తాను మరచింది. తన మనస్సునే అధిగమించింది. తన ఆత్మనే కృష్ణునికి నైవేద్యం పెట్టింది.కృష్ణప్రేమలో మునిగిపోయింది. తను వేరు కృష్ణుడు వేరు అన్న భావనకు అతీతురాలైంది. తానే కృష్ణునిగా మారింది. అంతగా తన వ్యక్తిత్వాన్ని ఆమె కృష్ణునిలో లయం చెయ్యగలిగింది.ఆమె ప్రేమకు యోగేశ్వరుడైన కృష్ణుడు కూడా చలించాడు. మహర్షుల కఠోరతపస్సుకు ఏ మాత్రమూ చలించని దేవదేవుడు విచలితుడైనాడు.రాధ ప్రేమలో కృష్ణుడు పిచ్చివాడయ్యాడు.ఆమెకు పరిపూర్ణ బందీ అయిపోయాడు.జీవితాంతం కఠోరమైన నియమనిష్టలు పాటిస్తూ సాధన చేసే యోగులకు కూడా దక్కని సంపద ఆమె సొంతం అయింది.భగవంతుడే ఆమెకు దాసానుదాసుడయ్యాడు.కృష్ణుడు రాధకు ఎంతగా దాసుడయ్యాడంటే,ఆమె అనుజ్ఞ లేనిదే ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వడు, ఎవరితోనూ మాట్లాడడు.అంతగా ఆయన రాధకు బందీ అయిపోయాడు. తన నిష్కల్మషమైన పరిపూర్ణమైన ప్రేమతో రాధ భగవంతుని తనవాడిగా చేసుకుంది.రాధ ప్రేమ అంత గొప్పది. అది మానవుల ఊహకు అందనిది. దేవతలకే దుర్లభమైన స్తితి రాధ సొంతం అయ్యింది.
రాధాకృష్ణులు యమునా తీరంలో విహరించని చోటు లేదు. ఒకరి సాన్నిధ్యంలో ఒకరు కరిగిపోతూ ఊసులాడుకోని పొదరిల్లు లేదు.ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ప్రపంచాన్ని మరువని రోజులేదు. బృందావనం వారి ప్రేమకు మూగసాక్షిగా మిగిలింది. ప్రకృతి వారి ప్రేమకు పరవశించింది. వారి పాదాల స్పర్శకు పచ్చిక పులకరించేది. యమునానది పరవళ్ళు తోక్కేది.అక్కడ నిత్యమూ వసంత ఋతువే. నిత్యమూ కోకిలల గానాలు అక్కడ ప్రతిధ్వనించేవి. అక్కడ చెట్లు ఎప్పుడూ చిగురిస్తూనే ఉండేవి. మధుర సువాసనలు ఆ ప్రాంతాన్ని ఆవరించి ఉండేవి.నెమళ్ళు ఆనందనాట్యం చేస్తూనే ఉండేవి. భూమిమీద స్వర్గం దిగి వచ్చినట్లు ఉండేది.దేవతలు ఎల్లప్పుడూ వారి సూక్ష్మరూపాలలో అక్కడ కొలువై రాసలీలను వీక్షిస్తూ ఉండేవారు. అదొక ఆనంద ధామం. అదొక అంతులేని నిత్యోత్సవం.
కానీ,ఎంత గొప్ప ఆనందమైనా ఒకనాటికి సమాప్తంకాక తప్పదుకదా.అలాగే ఒకనాడు బృందావనలీల అయిపొయింది.కృష్ణుడు లోకంలో చెయ్యవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడం కోసం ఆయన అక్రూరునితో కలిసి బయలుదేరాడు.ఆ పోవడం పోవడం మళ్ళీ గోకులానికి రానేలేదు. మహారాజు అయ్యాడు.రాజ్యాలు నడిపాడు.యుద్ధాలు చేశాడు. చేయించాడు. జీవితమంతా ఎన్నెన్నో పనులలో తలమునకలుగా ఉన్నాడు. ఎనిమిదిమంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజభవనాలలో నివసించాడు. విలాసజీవితం గడిపాడు.
తన చిన్ననాటి ప్రేయసి రాధను మరచిపోయాడా?బృందావన గోపికల అమాయకమైన, నిష్కల్మషమైన ప్రేమను విస్మరించాడా?మహారాజు అయిన తర్వాత విలాసినుల వగలకు లోబడి పల్లెపడుచుల స్వచ్చమైన ప్రేమకు దూరమయ్యాడా?మనకు తెలియదు.ఆయన అంతరంగం ఆయనకే తెలియాలి.అగాధమైన ఆయన అంతరంగాన్ని ఎవరు శోధించగలరు? మాయా మానుష విగ్రహుని మనసు లోతుపాతులను ఎవరు గ్రహించగలరు?
కాని అమాయకులైన గోపికలు కృష్ణుని మరువలేదు.ఆయన ప్రేమే వారిని నడిపించింది. ఆయన ధ్యానమే వారికి ఊపిరైంది.వారి నాయిక రాధ,కృష్ణుని అసలే మరువలేదు.ఆమె జీవితమంతా కృష్ణుని కోసం ఎదురుచూచింది. కృష్ణప్రేమలో నిరంతరం రగిలిపోయింది.మౌనవేదనలో తన జీవితాన్నే విరహాగ్నిలో వ్రేల్చింది.నిరంతర ధ్యాననిమగ్నతలో,ప్రేమవిహ్వలతలో తపించింది.
ఆ తపనే మహా తపస్సైంది.ఆ నిరంతర తపోఫలంగా లోకమంతా ఆమెకు కృష్ణస్వరూపంగా దర్శనమిచ్చింది. నెమలిపించం రంగు ఆమెకు తన ప్రియతముని గుర్తుకు తెచ్చింది.నెమలిని దగ్గరకు తీసుకుని దాని మెడను ముద్దాడింది.నీలమేఘం ఆమెకు కృష్ణుని దర్శనాన్ని ఇచ్చింది. తనను తాను మరచి ఆ మేఘం వెంట ఆమె పరిగెత్తింది.నీలాకాశం ఆమెకు శ్యామసుందరుని ఎదురుగా నిలిపింది.చేతులు చాచి ఆకాశాన్ని ఆమె కౌగిలించుకుంది.ప్రకృతిలో ప్రియతముని చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది.లోకులకు రాధ పిచ్చిదానిగా తోచింది. ఆమె చేష్టలు పిచ్చిచేష్టలుగా వారికి తోచాయి. కాని ఆమెకు ఏదీ పట్టదు. దేహభ్రాంతే లేని ఆమెకు లోకభ్రాంతి మాత్రం ఎక్కడిది?లోకులను చూచి ఆమె నవ్వింది.లోకులే ఆమెకు పిచ్చివారిలా తోచారు.ఇంద్రియమోహాలలో పడి ప్రేమమూర్తి అయిన భగవంతునికి దూరం అవుతున్న వారిని చూచి ఆమె పిచ్చిదానిలా నవ్వింది.
నిరంతరం ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టేవి. సజలనేత్రాలతో ఆమె ఎప్పుడూ పొంగి పొర్లుతున్న పవిత్ర గంగానదిలా తోచేది. విరహవేదనతో ఆమెకు ఒళ్ళు మంటలు పుట్టేది.ఆ వేడికి ఆమెను తాకిన చెలికత్తెల దేహాలు కాగిపోయేవి. ఆమె చెట్టు కింద కూచుంటే ఆ చెట్టు ఆకులు మాడిపోయేవి. ఆమె కూచున్న నేల కాలి నల్లగా అయేది.అంతటి విరహతాపం ఆమెలో తీవ్రయోగాగ్నిని సృష్టించింది.నీళ్ళతో కలిపి ఆమెకు అద్దిన చందనం వెంటనే ఎండిపోయి పొడిపొడిగా రాలిపోయేది.నిరంతరమూ ప్రపంచాన్ని మరచి ఆమె కృష్ణధ్యానంలో తన్మయురాలయ్యేది. తన శరీరస్పృహ ఎప్పుడో కాని ఆమెకు ఉండేది కాదు.మహత్తరమైన సమాధిస్తితులు ఆమెకు సునాయాసంగా కలిగేవి.దివ్యమైన సువర్ణకాంతి ఆమె దేహంనుండి వెలువడి చుట్టుపక్కల ఆవరించేది.దివ్య సుగంధపరిమళాలు ఆమెను ఆవరించి ఉండేవి.ఆమె ముఖంలోని దేవతాకళను చూచినవారు సంభ్రమానికి గురయ్యేవారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేవారు.
ఈ విధమైన నిరంతరధ్యానంతో రాధ తానే కృష్ణునిగా మారింది. తన వ్యక్తిత్వం కరిగిపోయింది. తాను రాధను అన్న విషయం పూర్తిగా మరచింది.తానే కృష్ణుణ్ణి అన్న అనుభవాన్ని పొందింది.
ఇదిలా ఉండగా ఒకరోజున ద్వారకలో అష్టభార్యలకూ కృష్ణుని జాడ కనిపించలేదు. ఉన్నట్టుండి ఆయన మాయమై ఎక్కడికి పోయాడో తెలియడం లేదు.అంతటా వెదికారు. ఎక్కడా ఆయన కనిపించడు. వారికి తామే కృష్ణుని అంతరంగ సఖులమని గర్వం ఉండేది. తాము ఇంతగా ప్రేమించే కృష్ణుడు తమను వదిలి ఎక్కడికి పోయాడా అని వారికి అనుమానమూ భయమూ కోపమూ కలిగాయి. అప్పుడు వారి బాధను చూడలేక, మహోన్నతభక్తుడైన నారదమహర్షి కరుణతో వారికి దర్శనమిచ్చి బృందావనం వెళ్లి చూడమని సలహా చెప్పాడు.
ఆయన సూచన మేరకు అక్కడకు వెళ్ళిన వారికి ఒక మనోహరమైన దృశ్యం కనిపించింది.
పున్నమివెన్నెలలో,చల్లని యమునాతీరంలో, మనోహరమైన పూలపొదరిండ్ల మధ్యన పుష్పసుగంధభరిత మనోహరనికుంజమధ్యంలో తన సఖుల మధ్యన రాధాసమేతుడై మృదుమధుర మురళీనాదాన్ని వెదజల్లుతూ తేజోమూర్తిగా వెలుగుతున్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా ఆనందప్రవాహం ముంచెత్తుతూ ఉన్నది. అక్కడ చెట్లూ ఆకులూ పూలూ అన్నీ ఏదో కాంతితో మెరిసిపోతున్నాయి. గోపికలూ,రాధా,కృష్ణుడూ అప్పటివరకూ వారికి తెలిసిన దేహధారులైన మనుషులలాగా కనిపించడం లేదు. దేవతాస్వరూపాల వలె వెలుగుతూ ఉన్నారు. ఆ మహత్తర దివ్యదర్శనాన్ని చూచి నోట మాటరాక అప్రతిభులైన వారినిచూచి చిరునవ్వు చిందిస్తూ నల్లనయ్య ఇలా అన్నాడు.
'ప్రియతములారా. మీరందరూ నన్ను ప్రేమించారు.నిజమే!!కాని ప్రేమలోని ఆనందాన్ని కోరి నన్ను మీరందరూ ప్రేమించారు. నాకోసం నన్ను మీరు ప్రేమించలేదు. నా సాన్నిధ్యంలో ఆనందంకోసం మీరు నన్ను కోరుకున్నారు. మీకు నేను ముఖ్యమే. కాదనను.కాని అంతకంటే మీ ఆనందమే మీకు ముఖ్యం.
రాధ అలాకాక నన్ను నన్నుగా ప్రేమించింది.తన ఆనందం కోసం నన్ను ప్రేమించలేదు.నా సంతోషాన్ని నిత్యమూ ఆశించింది.దానికోసం తన వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించి తానొక శూన్యంగా మిగిలింది. తానే అదృశ్యమై తన ఆత్మను నాకు పూర్ణంగా అర్పించింది. తానే నేనుగా మారింది. అందుకే ఆమె ప్రేమ మీ అందరి ప్రేమకంటే అత్యున్నతమైనది. నేను ఆమె దాసుడను. ఇటువంటి ప్రేమను మీరూ కలిగి ఉన్నప్పుడు మాత్రమె నేను మీవాడిని అవుతాను. నేను రాధను వదలి రాలేను. ఆమె ప్రేమకు నేను బందీని. కనుక మీకు నేను కావాలంటే రాధను ప్రార్ధించండి. ఆమె ఒప్పుకుంటే నేను మీతో వస్తాను. లేకపోతే రాలేను.మీరందరూ నా భార్యలు మాత్రమే కాని రాధిక నాకు అత్యంత ప్రియతమురాలు.ఆమె నా ప్రేయసి.నా హృదయంలో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది.'
అందరూ ఆయన మాటలు విన్నారు. రాధ పొందిన ప్రేమను అందుకోవాలంటే, రాధ చేరుకున్న స్థితిని పొందాలంటే ఈజన్మలో తమవల్ల కాదని వారికి అర్ధమైంది.అప్పుడు వారంతా ప్రేమమయి రాధకు ప్రణమిల్లి 'ఓ మనోజ్ఞా, అద్భుతమైన నీ ప్రేమతో భగవంతుడినే నీ ప్రేమికునిగా చేసుకున్నావు. ఎవరికోసం లోకం అంతా పరితపిస్తున్నదో ఆ దేవదేవుడు నిన్ను వదలి ఎటూ పోలేనంటున్నాడు. భార్యలమైన మాతో రానంటున్నాడు. రాజభవనాలను, అప్సరసల వంటి భార్యలను వదలి, ఈ నదీతీరంలో ఈ చెట్లమధ్యన నీతోనే ఉంటానని అంటున్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పది? కనీసం దానిలో ఒక్క కణం మాకు దక్కితే చాలుకదా మా జన్మలు ధన్యములు అవడానికి? తల్లీ. నీ స్థాయిని మేము ఎన్నటికీ అందుకోలేము.దయుంచి కృష్ణుని మాతో పంపించు' అని ప్రార్ధించారు.
దానికి రాధాదేవి చిరునవ్వుతో 'సరే అలాగే కానివ్వండి.కృష్ణుని మీరు తీసుకువెళ్ళండి. అతను మీతో తప్పక వస్తాడు. కాని అతను ఇక్కడకూడా ఉంటాడు. అంతే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. నాతోనే నాలోనే నిత్యమూ నివసిస్తాడు.యోగేశ్వరుడూ సర్వేశ్వరుడూ అయిన కృష్ణునికి అది అసాధ్యం కాదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు నన్ను వదలి ఉండలేడు. నేనూ అతన్ని వదలి ఉండలేను. అతనూ నేనూ వేర్వేరు కాదు. మేమిద్దరమూ ఒక్కరమే. కాని లోకలీల కోసం మీతో వస్తాడు. ఇది మీకు అర్ధంకాని దివ్యలీల. మహామహులైన యోగులకు కూడా ప్రేమయొక్క రుచి తెలియనిదే ఈ లీల అర్ధం కాదు.' అని కృష్ణుని వైపు చూచి మనోహరమైన చిరునవ్వు నవ్వింది. అప్పుడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వారితో కలిసి ద్వారకకు పయనమయ్యాడు.
వారందరూ కలిసి కనుచూపు మేరకు వెళ్లి వెనుకకు తిరిగి చూడగా, అంతకు ముందు వారు చూచిన రీతిలోనే, మళ్ళీ గోపికలు రాధతో కృష్ణుడు వారికి యమునాతీరంలో యధావిధిగా రాసలీలలో దర్శనం ఇచ్చాడు.పక్కకు తిరిగిచూడగా కృష్ణుడు నవ్వుతూ మళ్ళీ వారితోనే ఉన్నాడు. అప్పుడు వారికి సత్యమేమిటో అర్ధమౌతుంది.
బృందావన రాసలీల నిత్యమూ సాగుతూనే ఉంటుంది. అక్కడ మహత్తరమైన ప్రేమప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోకవాసనలు అందుకోలేని స్వచ్చమైన ప్రేమమూర్తులుగా రాదాకృష్ణులు అక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. రాసలీల ఆ దివ్యభూమిలో నిత్యమూ జరుగుతూనే ఉంటుంది.ఇది ఇప్పటికీ ఉంది.చూడగలిగిన వారికి కనిపిస్తుంది.ఆస్వాదించే శక్తి ఉంటే అందుబాటులోకి వస్తుంది.
నిజానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. అతని ఛాయ మాత్రమే గోపికలను వదిలి వెళ్లి లోకలీలను నడిపింది. ప్రేమమూర్తి అయిన కృష్ణుడు వారిని వదిలి ఎక్కడికి పోగలడు? అతను వారి ప్రేమకు కట్టుబడ్డాడు. నిత్యమూ రాసలీలలో అతను అక్కడే ఉంటాడు. వారి ప్రేమ కాలానికి అతీతంగా అలా వెలుగుతూనే ఉంటుంది.
అట్టి ప్రేమను పొందగలిగిన జీవితాలే నిజమైన జీవితాలు. ఆ ప్రేమ లేశమాత్రం తాకిన హృదయాలే ధన్యములు. రాధానుగ్రహం అనే ప్రేమసముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారుతాడు. అతని వంశం మొత్తం ధన్యం అవుతుంది. అతని పూర్వీకులు అందరూ ఉత్తమగతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్యప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు.యోగులకూ తపస్వులకూ అందని మహత్తర దివ్యభూమిక అతనికి అందుతుంది. అతను పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఎదురుగా కనిపిస్తాడు. మాట్లాడతాడు.
ఆ మహత్తరమైన ప్రేమముందు లోకం తుచ్చంగా కనిపించదూ? ఈ ప్రేమ ముందు స్వార్ధపూరిత జీవితాలు అల్పాతి అల్పములుగా అనిపించవూ? అటువంటి ప్రేమను పొందని ఈ జన్మలెందుకు?క్రిమికీటకాలుగా బతికి చివరికి మట్టిలో కలిసే ఈ జీవితాలేందుకు?ప్రేమను ఆస్వాదించని మనిషి జన్మ ఎందుకు?
నిత్యానందసీమలో ప్రియతముని మోమును వీక్షిస్తూ కాలాన్ని మరచి కరిగిపోని ఈ భ్రాంతిమయ బానిస బ్రతుకులెందుకు?
తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. తన ఆనందాన్ని కాక ప్రియుని ఆనందాన్ని ఆశించడమే రాదాతత్వం. సంపూర్ణ ఆత్మార్పణే ఈ సాధనారహస్యం.ఆ మహోన్నత అర్పణలోనే దైవాన్ని కదిలించగల కరిగించగల మహత్తరమైన శక్తి ఉన్నది.ఆ ప్రేమకే దైవం కట్టుబడుతుంది. దీనికి తక్కువైన ఇతరములైన ఏ సాధనలకూ దేవదేవుడు లొంగడు.
అందుకే రాధాతత్వం సర్వోత్తమం. రసరమ్యం. మహత్తర ప్రేమనిలయ రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యమూ వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలూ రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్ధిస్తూ ఉంటారు.ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణదర్శనం పొందలేరు.ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు.దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమె తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలదు. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారి లేదు.
శ్రీరామకృష్ణులకు కూడా,మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది.రాధాదేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయన శరీరంలో లీనమైంది.తత్ఫలితంగా రాధాదేవి పొందిన ప్రేమసమాధిని ఆయన రుచి చూడగలిగారు.ఆ తర్వాతనే ఆయనకు కృష్ణ సాక్షాత్కారం కలిగింది.ఆ కృష్ణుడు కూడా ఆయనలోనే లీనమయ్యాడు.ఆవిధంగా రాధాకృష్ణులు ఆయనలోనే ఉన్నారు.అందుకే ఆయన ముఖం ఎప్పుడూ అంత ఆనందంతో వెలుగుతూ ఉండేది.
రాధానుగ్రహమే కృష్ణదర్శనానికి దారి.రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే కృష్ణుడు కనికరించడు.కనిపించడు.రాధాదేవి కరుణించి అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు.రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది.అంటే,ప్రేమోన్మత్త పూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి.ఆ స్థితే రాధ.
ఇదే రాధా ప్రేమ తత్త్వం 

No comments